భారత్ లో గతకొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభతోపాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ఈ మేరకు పలు కీలక సిఫార్సులు చేయనున్నట్లు సమాచారం.
జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని (చాప్టర్) చేర్చాలని లా కమిషన్ ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో తొలి జమిలి ఎన్నికలు 2029 మే-జూన్‌లో జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. రానున్న అయిదేళ్లలో మొత్తం మూడు దశల సర్దుబాట్లతో దేశ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీల గడువు ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్న సంగతి గమనార్హం.