కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే అభయహస్తం గ్యారంటీలను అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా మొదట మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఇక ఈ పథకం అమలైన రోజు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
మహాలక్ష్మి పథకానికి ముందు.. ఆ తర్వాత అన్నట్లు టీఎస్‌ఆర్టీసీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లు అత్యధిక సంఖ్యలో మహిళను గమ్యస్థానానికి చేర్చి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. పథకం అమలు నాటి నుంచి నేటి వరకూ 13.50 కోట్ల మంది మహిళలను గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ గమ్యస్థానాలకు చేర్చింది.
హైదరాబాద్ రీజియన్‌లో 1,410 బస్సులను ఆర్టీసీ నడుపుతుండగా.. సికింద్రాబాద్ జోన్‌లో 1,260 బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్‌జోన్ మొత్తం 2,670 బస్సుల్లో నిత్యం 20 లక్షల నుంచి 21 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. ఇందులో 14.50 లక్షల మంది మహిళా ప్రయాణికులే ఉన్నారు.