లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కసరత్తు షురూ చేశాయి. ఓవైపు అభ్యర్థులను దశలవారీగా ప్రకటిస్తూ మరోవైపు ప్రచారంలో వేగం పెంచాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది.
ఇందులో భాగంగానే గులాబీ దళానికి కంచుకోట అయిన కరీంనగర్లో ఇవాళ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కరీంనగర్‌లో ఇవాళ రెండో సభ నిర్వహించబోతున్నారు. ఏ పథకమైనా ఉద్యమమైనా కరీంనగర్ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని.. అందుకే అదే సెంటిమెంట్‌గా ఎస్ఆర్ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటూ.. కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కరీంనగర్ నుంచి కధన భేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.