లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై లోక్ సభ ఎన్నికల్లో వారు ఎలా పని చేయాలి…? ఏ ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశాలను వివరిస్తారు.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మోదీ సాహాసోపేతమైన నిర్ణయాలపై అమిత్ షా మార్గనిర్ధేశనం చేయనున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో షా సమావేశం కానున్నారు. సాయంత్రం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ తో సమావేశమవుతారు. ఈ సమావేశానంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 6గంటల 10నిమిషాలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్థేరి వెళ్లనున్నారు.