తెలంగాణ లోక్సభ ఎన్నికల రాజకీయ రోజురోజుకు రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా బీజేపీ రెండో జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 17లోక్ సభ స్థానాలు ఉండగా తొలి జాబితాలో తొమ్మిది స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కమలదళం తాజాగా రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
రెండో జాబితాలో ఆదిలాబాద్ – గోడెం నగేష్, పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్, మెదక్ – రఘునందన్ రావు, మహబూబ్ నగర్ – డి.కె. అరుణ, మహబూబాబాద్ – సీతారాం నాయక్, నల్లగొండ నుంచి సైదిరెడ్డిని బరిలో నిలిచారు. సిట్టింగుల్లో ముగ్గురికి మరోసారి అవకాశం దక్కగా.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు మాత్రం నిరాశ ఎదురైంది. బీజేపీ ప్రకటించిన 15 స్థానాల్లో ఇటీవల పార్టీలో చేరిన ఏడుగురిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక తొలి జాబితాలో సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి, నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్, కరీంనగర్ – బండి సంజయ్, జహీరాబాద్ – బి.బి.పాటిల్, నాగర్‌కర్నూల్ – భరత్, మల్కాజిగిరి – ఈటల రాజేందర్, భువనగిరి – బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ – డాక్టర్ మాధవి లత, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలో నిలిపింది.