ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 స్థానాలే వచ్చాయని ఆ దశలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు అధిష్టానం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించిందన్నారు సీఎం రేవంత్. రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించే గొంతుకై పోరాడడంతో 1999లో 91 ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ చేరిందని, చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగించిన పాదయాత్రతో 2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నాడు ఏపీ నుంచి వచ్చిన 33 ఎంపీ సీట్లతోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమేనని, అందుకు కష్టపడుతున్న షర్మిలనే రాజశేఖర్‌రెడ్డికి నిజమైన వారసురాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వై.ఎస్. సంకల్పాన్ని నిలబెట్టేవారే వారు ఆయన వారసులవుతారని, ఆయన ఆఖరి కోరికకు వ్యతిరేకంగా ఉండే వారు ఎలా ఆయన వారసులవుతారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ అంటేనే షర్మిలా రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జలయజ్ఞంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, హంద్రీనీవా వంటివి ప్రారంభించారని, హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు, ఫార్మా పరిశ్రమలతో అభివృద్ధి చేశారని కొనియాడారు. రాజశేఖర్‌రెడ్డి రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు పక్కన మోత గాళ్లలా చంద్రబాబు నాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి తయారయ్యారని ఆయన మండిపడ్డారు.