ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆయణ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో కీలక విషయాలను రాబట్టారు. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు ప్రణీత్ రావును ఆధారాల ధ్వంసం విషయంపై ప్రశ్నించారు. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్.. ఫిర్యాదులో భాగంగా.. ప్రణీత్ రావు కాల్ డీటెయిల్ రికార్డ్స్ ఐఎంఈఐ నెంబర్లు, ఐపీ అడ్రెస్సుల వివరాలు వ్యక్తిగత పరికరాల్లో కాపీ చేసుకుని ధ్వంసం చేశాడని పేర్కొన్న విషయం తెలిసిందే.
ప్రణీత్ రావు కాపీ చేసుకున్న డిజిటల్ పరికరాలు ఎక్కడ ఉంచాడనే అంశంపై ప్రణీత్ రావును పోలీసులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వద్ద పని చేసిన ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మరో వైపు ప్రణీత్‌రావు కస్టడీలో ఉండగానే ఎస్‌ఐబీలోని కార్యాలయానికి వెళ్లి అతనికి కేటాయించిన రెండు 17 కంప్యూటర్లను పరిశీలించనున్నారు. దీంతో పాటు ఆధారాలు ధ్వంసం చేసిన రోజు సీసీ టీవీ కెమారాలు ఆఫ్ చేశారని గుర్తించిన అధికారులు.. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్‌ను కూడా విచారించాలని నిర్ణయించారు.