దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆప్‌తో పాటు ఇతర విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై జర్మనీ స్పందించింది. ‘‘భారత్ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు’’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది.
ఈ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ పిలిచింది. ఈ ఉదయం జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్‌వీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.