ప్రణిత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు..!

-

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను విచారించిన పోలీసులు.. తాజాగా భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ భుజంగరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో శనివారం విచారణకు పిలిచి ప్రశ్నించిన అనంతరం భుజంగరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్లో అదనపు ఎస్పీగా పని చేశారు. ఈ సమయంలోనే ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు కలిసి ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు రాష్ట్రంలోని పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ట్యాపింగ్ డేటాను మొత్తం ధ్వంసం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో డీజీపీ ప్రణీత్ రావును సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. కోర్టు అనుమతితో ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన వివరాల ఆధారంగా గతంలో ఎస్బీఐలో పని చేసిన అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావు కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం స్టేట్ పాలిటిక్స్  లో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news