రాష్ట్రంలో 9 లక్షల 14 వేల 354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఓట్ల తొలగింపు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొత్తం 7 లక్షల 31 వేల 573 మంది వివరాలు సవరించినట్లు చెప్పారు. నూతనంగా ఓటరు నమోదుతోపాటు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గంకి మార్చుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.
“రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 30 లక్షల 13 వేల 318కి చేరింది. ఓటర్లలో పురుషులు కోటీ 64 లక్షల 14 వేల 693 మంది కాగా మహిళలు కోటీ 65 లక్షల 95 వేల 896 మంది. ట్రాన్స్ జెండర్లు 2 వేల 729 మంది ఉండగా.. 15 వేల 472 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 8 లక్షల 72 వేల 116 మంది ఉండగా.. 85 ఏళ్ల దాటిన వారు లక్ష 93 వేల 489 మంది, దివ్యాంగులు 5 లక్షల 26 వేల 286, ఎన్ఆర్ఐ ఓటర్లు 3 వేల 409 మంది ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా. 38 కోట్ల 12 లక్షల రూపాయల విలువైన నగదు, నగలు, మద్యం, డ్రగ్స్, వస్తువులు స్వాధీనం చేసుకున్నాం అని వికాస్ రాజ్ తెలిపారు.