ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఆలోచించండి? అంటూ వ్యాఖ్యానించింది. 2021లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న యూట్యూబర్ దురైమురుగన్ సత్తాయికి బెయిల్‌ను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
దురైమురుగన్ బెయిల్‌ను రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు .. నిందితుడు దురైమురుగన్ నిరసన వ్యక్తం చేయడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కిందకు రాదని పేర్కొంది. బెయిల్‌పై ఉండే సమయంలో అసభ్య వ్యాఖ్యలు చేయకూడదని అతడికి షరతులు విధించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కూడా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.