సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు పూర్తయింది. వేసవి దృష్ట్యా ఉదయమే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిదశలో 102 స్థానాల్లో ఓటింగ్ జరగ్గా, 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
తొలి దశలో మొత్తం 62.37 శాతం ఓట్లు పోలయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి దశ పోలింగ్లో అత్యధిక ఓటింగ్ శాతం బంగాల్లో నమోదైనట్లు తెలిపింది. ఆ రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు 77.57శాతం ఆ రాష్ట్రంలో ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది.
మరోవైపు తొలిదశలో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో 102 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకోగా.. మహారాష్ట్ర నాగ్ పుర్ లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి ఆమ్గే ఓటు వేశారు. ప్రముఖులు కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సామాన్యుల పౌరుల వలె క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.