సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం రోజున ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62.37 శాతం ఓట్లు పోలయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొదటి దశ పోలింగ్‌లో బంగాల్లో అత్యధికంగా 77.57శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో నాగాలాండ్‌లో మాత్రం దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్‌లోని 6 జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు.
ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తూ 2010 నుంచి పోరాటం చేస్తున్న నాగా తెగ ప్రజలు ఈ ఎన్నికలను బహిష్కరించారు. నాగాలాండ్‌లోని ఆ ఆరు జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన వారున్నారు. రాష్ట్రంలో మొత్తం 13.25 లక్షల ఓటర్లు ఉండగా, ఈ ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఉన్నారు. 20 శాసనసభ స్థానాల పరిధిలో మొత్తంగా 738 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించినప్పటికీ ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.