అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల్లో కొందరు, హత్యలకు గురవుతూ మరికొందరు, ఇంకొందరేమో అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. తాజాగా మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన భారత విద్యార్థి గత నెల ప్రారంభంలో శవమై కనిపించాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు.. అతడి మరణానికి ‘బ్లూవేల్ ఛాలెంజ్’ అనే గేమ్ కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిని ఆత్మహత్య కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు.
చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి రెండు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. ఈ తరుణంలో ఈ సూసైడ్ గేమ్ గురించి మరోసారి చర్చ మొదలైంది. బ్లూవేల్ ఛాలెంజ్ కొత్తదేమీ కాదు. ఐదారేళ్ల క్రితం కూడా దీని గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. తాజాగా అమెరికాలోని మరణాలతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా టీనేజీలో ఉన్న వారు వీటికి బాధితులవుతున్నారు. పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు నిత్యం కన్నేసి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.