రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. ఈ జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సోమవారం రోజున నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు వడదెబ్బతో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 దాటిన తర్వాత అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వెంట గొడులు, క్యాప్ లేదా స్కార్ఫ్ వంటివి ధరించాలని.. వాటర్ బాటిల్ తప్పకుండా వెంట ఉండాల్సిందేనని సూచించారు.