రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ తన సొంత మేనిఫెస్టోను నియోజకవర్గంలో ఆవిష్కరించారు. నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద ‘భరత్ టెన్ ప్రామిసెస్’ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విద్రోహక శక్తులను నగర బహిష్కరణ చేసి ప్రశాంతమైన నగరంగా ఉంచడం వంటి హామీలు ఉన్నాయి. నగర వాసులకు 24 గంటలూ మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు పదివేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయమని ఎంపీ భరత్ తెలిపారు.

రివర్ సిటీ అందాలు చూసేలా ఘాట్లను ఏకం చేయడం, గోదావరి బండ్ ను హైదరాబాదు టాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడం, రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్ మెంట్, ఇంక్యుబేషన్ సెంటర్స్ తీసుకురావడం, జగనన్న కాలనీలలో 40 వేల మందికి ఇళ్ళు కట్టించి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత తనదని భరత్ తెలిపారు.
