తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వివేకా హత్య కేసును మరోసారి ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో జగన్ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని .. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్‌ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని షర్మిల విమర్శించారు. రూ.వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా షర్మిల స్పందిస్తూ.. తన భర్త అనిల్ కుమార్ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు.. కలవరని స్పష్టం చేశారు. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు.
కంటికి కనిపించని పొత్తును జగన్ కొనసాగిస్తున్నారుని.. క్రైస్తవులపై దాడి ఘటనలో కూడా వైసీపీ స్పందించలేదని షర్మిల అన్నారు. జగన్ బీజేపీ దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారని.. మోదీ వారసుడిగానే ఆయన ఉన్నారని ఆరోపించారు. వైసీపీ ఇంత అవినీతిలో కూరుకుపోయినా బీజేపీ చర్యలు తీసుకోలేదంటే కారణం.. జగన్ ఆ పార్టీకి దత్తపుత్రుడు, కాబట్టేనని షర్మిల వ్యాఖ్యానించారు.