ఆర్ఆర్ ట్యాక్సు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ నుంచి దిల్లీ వరకు ఆర్ఆర్ ట్యాక్సుపైనే చర్చ జరుగుతోందని తెలిపారు. ఆర్ఆర్ ట్యాక్సు గురించి ప్రతి పిల్లవాడికీ తెలుసని పేర్కొన్నారు. తెలుగులో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి కలెక్షన్లు సాధించిందో అందరికీ తెలిసిందేనన్న మోదీ.. ఆ సినిమా కంటే ఆర్ఆర్ ట్యాక్సు వసూళ్లు మించిపోయాయని ఆరోపించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా నడిచినన్ని రోజులు రూ.వెయ్యి కోట్లు వసూళ్లు వచ్చాయి. కొద్దిరోజుల్లోనే ఆర్ఆర్ఆర్ వసూళ్లను మించి ఆర్ఆర్ ట్యాక్సు వసూలు చేశారు. తెలంగాణలోని ఆర్ లూటీ చేసి దిల్లీలోని ఆర్కు ఇస్తున్నారు. ఆర్ఆర్ ఆటను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధిచెబుతారు. ఐదేళ్లుగా అంబానీ, అదానీ పేర్లు జపం చేసిన కాంగ్రెస్ ఒక్కసారిగా ఆపేసింది. ఎన్నికల ప్రకటన రాగానే అంబానీ, అదానీపై విమర్శలు మానేసింది. అంబానీ, అదానీ జపం మానడం వెనక రహస్యాన్ని కాంగ్రెస్ ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఎంఐఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌ను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఐఎంకు లీజుకు ఇచ్చింది. అని మోదీ విమర్శించారు.