కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా దక్షిణాది ప్రజలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ మరోసారి ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన దేశ పరువు, ప్రతిష్టలపై హస్తం పార్టీ వేసిన మరక చెరిగి పోతుందా అని ప్రశ్నించింది.
పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. దేశాన్ని విభజించే పనిని బ్రిటిష్ వాళ్ల దగ్గర నుంచి కాంగ్రెస్ తీసుకుందని ఆరోపించారు. తొలుత హిందూ-ముస్లిం అంటూ వేరు చేసిన ఆ పార్టీ ఇప్పుడు దక్షిణాది-ఉత్తరాది విభజనకు యత్నిస్తోందని మండిపడ్డారు. చర్మం రంగును బట్టి ప్రజలను విభజించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం గురించి చెబుతూ దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా, తూర్పు భారతంలో ప్రజలు చైనీయుల్లా ఉంటారని పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.