క్యారీ బ్యాగులకు రూ.14 వసూలు చేసిన డామినోస్ పిజ్జాపై రూ.10 లక్షల ఫైన్..!

-

వ్యాపార సంస్థలు తాము అమ్మే వస్తువులను ఇచ్చేందుకు గాను ఉపయోగించే క్యారీ బ్యాగులకు గాను వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయరాదని వినియోగదారుల ఫోరం ఎన్నిసార్లు చెప్పినా పలు సంస్థలు వినడం లేదు. దీంతో వారు పెద్ద ఎత్తున జరిమానా కట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ ఇద్దరు కస్టమర్లకు ఇచ్చిన క్యారీబ్యాగులకు గాను రూ.14 వసూలు చేసినందుకు ఆ కంపెనీపై వినియోగదారుల ఫోరం ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే…

 

చండీగఢ్‌లో ఓ డామినోస్ పిజ్జా ఔట్ లెట్‌ ఇద్దరు వేర్వేరు కస్టమర్లకు రెండు క్యారీ బ్యాగులను ఇచ్చింది. అయితే వాటికి రూ.14 వసూలు చేసింది. దీంతో ఆ వినియోగదారులు అక్కడి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు విచారించిన ఫోరం డామినోస్ పిజ్జాకు రూ.10 లక్షల జరిమానా విధంచింది. ఆ మొత్తాన్ని చండీగఢ్ పూర్ పేషెంట్ వెల్ఫేర్ ఫండ్ (పీపీడబ్ల్యూఎఫ్) ఖాతాలో జమ చేయాలని డామినోస్ పిజ్జాను ఫోరం ఆదేశించింది.

ఇక వినియోగదారులకు రూ.1500 నష్ట పరిహారం చెల్లించాలని, అలాగే క్యారీబ్యాగులకు వారు ఇచ్చిన రూ.14లను కూడా వెనక్కి ఇచ్చేయాలని ఫోరం డామినోస్ పిజ్జాను ఆదేశించింది. అయితే నిజానికి చండీగడ్‌లో ఇదే మొదటి కేసు కాదు. గతంలో పలు వ్యాపార సంస్థలు ఇలాగే తమ కంపెనీ బ్రాండ్ లోగో కలిగిన క్యారీ బ్యాగులకు గాను కస్టమర్ల నుంచి చార్జిలు వసూలు చేస్తూ పట్టుబడ్డాయి. దీంతో బాటా ఇండియాకు రూ.11వేలు, వెస్ట్ సైడ్‌కు రూ.10,500, లైఫ్ స్టయిల్‌కు రూ.13వేలు, బిగ్ బజార్‌కు రూ.11,518 ఫైన్ విధించారు. ఇక ఇప్పుడు డామినోస్ పై ఏకంగా రూ.10 లక్షల జరిమానా విధించారు. అంతే మరి.. నిబంధనలను అతిక్రమిస్తే ఏ వ్యాపార సంస్థపైనైనా ఇలాంటి చర్యలు తప్పవు..!

Read more RELATED
Recommended to you

Latest news