లోక్‌సభ ఎన్నికలు నాలుగు దశలు పూర్తయ్యాయి. మరో మూడు దశలు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ చేస్తోంది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడం వల్ల అనుబంధ భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. వేడుకలకు వీలుగా పనులు కొనసాగుతున్నాయి.
మునుపటి మాదిరిగా వర్తులాకార భవనం (ప్రస్తుత సంవిధాన్ సదన్)లో కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతించనున్నారు. దిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వాల అతిథి గృహాల్లో, ‘వెస్టర్న్ కోర్ట్ హాస్టల్ కాంప్లెక్స్’లో లోక్‌సభ నూతన సభ్యులకు తాత్కాలిక వసతి కల్పిస్తారు.జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండడం వల్ల ఆరోజు సాయంత్రం నుంచే నూతన సభ్యులు దిల్లీకి చేరుకోనున్నట్లు సమాచారం.
పార్లమెంటు భవనంలో ప్రవేశానికి, వివిధ సదుపాయాలు పొందడానికి అవసరమైన స్మార్ట్‌కార్డుల కోసం కొత్త సభ్యులు వేర్వేరు దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. వాటిని స్వీకరించి, వారిని ఫోటో తీసేందుకు బాంకెట్ హాల్లో, ఇతర గదుల్లో ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేస్తోంది.