తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది డిసెంబరు 3 వరకు తీసుకున్న రుణాల్లో రూ.2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేయాల్సి ఉన్నందున, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయ వనరులను సమకూర్చి తద్వారా తీసుకున్న రుణంతో రుణమాఫీకి ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రుణమాఫీని ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
మార్గదర్శకాల రూపకల్పన చేసి బ్యాంకర్లకు ఇస్తే ఆ మేరకు ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుంది? ఎంత మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుందనే అంశాలను బ్యాంకర్లు తేల్చనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు కొందరుంటే, బంగారం కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వారు మరికొందరు. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలా లేక పాసు పుస్తకాలు పెట్టి రుణం తీసుకున్న వారికే వర్తింపజేయాలా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ అంటున్నందున అంతకు మించి రుణాలు తీసుకున్న రైతులకు కూడా నిర్దేశించిన రూ.2 లక్షలను వర్తింపచేస్తారా లేదా అన్నదానిపై కూడా ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.