తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిసినందున ఫలితాలపై పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో బెట్టింగ్ రాయుళ్ల పందేలు కోట్లకు చేరాయి. ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఎంత ఆధిక్యం? కీలక నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తోంది? ఎక్కువ సీట్లుఎవరు సాధిస్తారు? ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది? అన్న అంశాలపై జోరుగా పందేలు సాగుతున్నాయి. కార్యకర్తల స్థాయిలో లక్షల్లో పందేలు వేస్తుంటే, నాయకుల స్థాయిలో కోట్లలో బెట్టింగ్ పెడుతున్నారు.
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో ఎటు చూసినా బెట్టింగ్ చర్చలే నడుస్తున్నాయి. కొంతమంది భూములను బెట్టింగ్‌ల్లో పెట్టడం గమనార్హం. మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి.
పిఠాపురంలోపవన్ కల్యాణ్ 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఒక వ్యాపారి రెండున్నర కోట్ల రూపాయలు దళారి వద్ద ఉంచినట్టు సమాచారం. ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన బెట్టింగ్ సాగుతోంది. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే, గతంలో కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి రికార్డు మెజారిటీలపై 1:3 చొప్పున పందేలు సాగుతున్నాయి.