ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ సమయాన ఇరాన్ ప్రజలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. మరోవైపు రైసీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఇవాళ (మే 21వ తేదీన) ఒక రోజు సంతాప దినం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతోపాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ కన్నుమూసిన సమయంలోనూ భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. రైసీతోపాటు అదే హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్ల హియన్ తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్‌మతీ సహా అధికారులు మరణించినట్లు తెలిపింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణవార్తను ఇరాన్ మీడియా ధ్రువీకరించింది.