కోల్‌కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అజీమ్ కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో హనీట్రాప్ చేయించి అన్వర్‌ను న్యూటౌన్ అపార్ట్‌మెంట్‌కు రప్పించినట్లు ప్రాథమిక సమాచారం. అక్కడ అన్వర్ గొంతు నులిమి చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఎముకలతో సహా శరీర అవయవాలను నిందితులు ముక్కలు చేసి వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి కోల్‌కతాలోని వివిధ ప్రదేశాల్లో పడేశారని వెల్లడించారు.
అమెరికా పౌరసత్వం ఉన్న బంగ్లాదేశీ అక్తరుజ్జమాన్ ఈ దారుణ హత్యకు ప్రధాన సూత్రధారి అని కీలక నిందితుడు జిహాద్ హవాల్దార్ తెలిపినట్లు సీఐడీ వెల్లడించింది. హవాల్దార్ మరో నలుగురు బంగ్లాదేశ్ జాతీయులతో కలిసి న్యూటౌన్ అపార్ట్‌మెంట్‌లో హత్య చేశామని ఒప్పుకున్నారని తెలిపింది.ఎంపీ శరీర భాగాలను ఎక్కడెక్కడ పడేశారో తెలుసుకునేందుకు అతడిని కస్టడీకి కోరుతామని చెప్పారు. ఎంపీ అన్వర్ వైద్య చికిత్స కోసం కోల్‌కతా వచ్చి ఈనెల 13వ తేదీ నుంచి అదృశ్యం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కోల్‌కతాలోని న్యూ టౌన్‌హాల్‌కు దర్యాప్తు బృందం వెళ్లగా.. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. సీసీటీవీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.