మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 2,18,674 మంది ఓటర్లు ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌ)కు ఓటేశారు. ఈ నియోజకవర్గంలో అనివార్యంగా బరిలో నుంచి వైదొలగాల్సి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటాకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చింది. 72 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకుండా పోవడం ఇదే మొదటిసారి. దీంతో బీజేపీకి గుణపాఠం నేర్పేందుకు నోటాకు ఓటేయాల్సిందిగా ఓటర్లకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
అలా మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్నికల సంఘం వెబ్సైటులో నమోదైన తాజా గణాంకాల ప్రకారం ఇండోర్లో నోటాకు వచ్చిన 2,18,674 ఓట్లు (16.28%). ఇండోర్ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెటు పొందిన అక్షయ్ కాంతి బమ్ చివరి దశలో తన నామినేషను ఉపసంహరించుకొని బీజేపీలో చేరడంతో ఇక్కడ హస్తం గుర్తు తరఫున అభ్యర్థి లేకుండా పోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని గోపాల్గంజ్ స్థానంలో నోటాకు గరిష్ఠంగా 51,660 ఓట్లు నమోదయ్యాయి. గోపాల్గంజ్ రికార్డును ఇపుడు ఇండోర్ అధిగమించింది.