తెలంగాణలో ఆగస్టు ఒకటో తేదీ కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేపట్టనుంది.
ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1వ తేదీన కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేసి.. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.