Four days of rain in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది… రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది.
వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలని, సిబ్బంది కొరత ఉంటే హోమ్ గార్డులను రిక్రూట్ చేసుకోవాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని, ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.