దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అరెస్టయ్యారు. ఆయణ్ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మంగళవారం రోజున మరోసారి ఆయణ్ను తీహార్ జైలులో ప్రశ్నించిన అధికారులు.. విచారణ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయణ్ను అరెస్టు చేసిన అధికారులు ఇవాళ ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్‌ను హాజరుపరచనున్నారు.
కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు సీబీఐ అనుమతిపొందింది. ప్రస్తుతం అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకొని ఈడీ ప్రశ్నించగా ఆ తర్వాత ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించి జైలుకు తరలించింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే 10 నుంచి జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్.. బెయిల్ ముగిసిన అనంతరం… సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2 మధ్యాహ్నం తీహార్ జైల్లో లొంగిపోయారు. తాజాగా అక్కడి నుంచి ఆయణ్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.