గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చెక్కుల పంపిణీలో జాప్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హుజారాబాద్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం రోజున హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. లబ్దిదారులకు చెక్కులు సిద్ధమైనా పంపిణీ చేయడానికి రెవెన్యూ అధికారులు అనుమతించడం లేదు. ఈనెల 27వ తేదీలోగా చెక్కులను బ్యాంకుల్లో జమ చేయని పక్షంలో అవి చెల్లవు. వాటి గడువు ముగిసిపోతుంది. అని కోర్టుకు వివరించారు. మరోవైపు అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ లబ్దిదారులు అర్హులైన పక్షంలో చెక్కుల గడువు తీరినా తాజాగా జారీ చేస్తామని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి అర్హులైన లబ్దిదారులకు చెక్కులను అందజేసేలోపే వాటి గడువు ముగిసిపోయినట్లయితే పిటిషన్‌ను అనుమతిస్తూ తక్షణం చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.