తెలంగాణలో 2029వరకూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో ఐదు సంవత్సరాలకు ఒకసారి, తెలంగాణలో 10 సంవత్సరాలకు ఒకసారి అధికారం మారే ట్రెండ్ ఉందని అన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు .అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయెుచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ రోజున రిజర్వులో ఉండే 15శాతం ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. వాటిని అటు ఇటు మారిస్తే ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదని సీఎం తెలిపారు. మూసీ నది సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. 55కిలోమీటర్ల మేర మూసీ నదిపై రోడ్డు, రైళ్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో నిరాశ్రయులయ్యే 10వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలనలో సీఎంగా ముద్ర వేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.