హైదరాబాద్ ఖాజాగూడలోని ది కేవ్ పబ్‌లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది. గంజాయి, డ్రగ్స్ వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఖాజాగూడలోని ‘ది కేవ్’పబ్ నిర్వాహకులు ‘సైకిడెలిక్’పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడంతో పోలీసులే షాక్ అయ్యారు.టీజీన్యాబ్, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పబ్‌లో సోదాలు చేసి 55 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దొరికిన వారిలో ఐటీ, వ్యాపార రంగాలకి చెందిన వారున్నారు. పార్టీ నిర్వహణకు ప్రధాన సూత్రదారులైన పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నలుగురు యాజమానులు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పబ్‌కి మేనేజర్‌గా నాగారంలోని శిల్పానగర్‌కు చెందిన ఆర్ శేఖర్‌కుమార్ వ్యవహరిస్తున్నాడు. సైకిడెలిక్ పార్టీ పేరుతో పబ్బులో ప్రత్యేక ఏర్పాటు చేసి ఒక్కొక్కరి ప్రవేశానికి 3 వేల చొప్పున ధర నిర్ణయించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫారెస్ట్ ఆల్కెమీ తదితర కోడ్‌భాషలో పార్టీ ఉన్నట్లు ప్రచారం చేశారు. ఎవరికీవారు ముందస్తుగా డ్రగ్స్ సేవించి పబ్‌కి రావాలని కోరారు. అలా వచ్చిన వారికి ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ సంగీతం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాధారణ వ్యక్తులు భరించలేనంత డ్రగ్స్ తీసుకుంటేనే ఆస్వాదించేలా శబ్ధాలుండేలా ఏర్పాటు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.