బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది. హైదరాబాద్ శంషాబాద్ మల్లిక కన్వెన్షన్‌లో జరగనున్న ఈ భేటీకి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరుకానున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్, తరుణ్ ఛుగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగగా.. ఇవాళ విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉదయం 10:30 గంటలకు శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్‌లో ఈ సమావేశం మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడిచినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని మార్గనిర్ధేశనం చేయనున్నట్లు సమాచారం. బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు సంస్థాగత ఎన్నికలపైన దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలిసింది.