తెలంగాణ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలో శుక్ర, శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు. ఈ జిల్లాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జూన్ లోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఇప్పటి వరకు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అయితే జూన్ నెల మొదట్లో వరుసగా మూడ్రోజులు భారీ వానలు కురవడంతో రైతులంతా సంబురపడి విత్తనాలు వేశారు. ఆ తర్వాత నుంచి వాన జాడ లేకపోవడంతో ఆ విత్తనాలు పాడైపోయి మళ్లీ వేయాల్సి వచ్చింది. మరోవైపు జులై నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు ఏకధాటిగా కురిసిన వానకు నగరమంతా జలమయమైంది. రహదారిపైకి వరద చేరి చెరువును తలపించింది. దీంతో పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు ట్రాఫిక్ లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.