ఏపీని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎగువ నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉద్ధృతి పెరగడంతో రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
మరోవైపు పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో వచ్చే రెండు మూడు రోజుల్లో ఇది మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.