దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్- డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన రైలు ఉదయం 11.30 గంటలకు చండీగఢ్ స్టేషన్ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌కు బయల్దేరగా.. మధ్యాహ్నం సమయంలో యూపీలోని ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో రైలులోని నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు ప్రారంభించింది. హెల్ప్లైన్ నంబర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రందగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50000 అనౌన్స్ చేసింది.