అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.డిప్యూటీ సీఎం భట్టి ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావులతో కలిసి సచివాలయంలో విద్యావేత్తలు ప్రొ. హరగోపాల్, ప్రొ కోదండరాం, ప్రొ. శాంతా సిన్హా, ప్రొ. అల్దాస్ జానయ్య, తదితరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా రంగంలోని పలు సమస్యలు, అంశాలను వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.విద్యా రంగం బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న పలు విషయాలను సీఎంగారు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని, అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ, ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ, పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫాంలు, పాఠ్య పుస్తకాల అందజేత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి చర్యలను వివరించారు.