అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయణ్ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు. ట్రంప్ అతివాద ‘ప్రాజెక్ట్ 2025’ అజెండాను ఓడించడం కోసం, దేశాన్ని ఏకం చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ తన పేరును ప్రతిపాదించడాన్ని కమలా హారిస్ స్వాగతించారు.
‘దేశ అధ్యక్షుడిగా అద్భుతమైన సేవలు అందించిన జో బైడెన్‌కు అమెరికా ప్రజల తరఫున కృతజ్ఞతలు. దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన ఆయనకు ధన్యవాదాలు. నిజాయితీ, చిత్తశుద్ధి, దేశభక్తి, సహృదయం ఇలాంటి లక్షణాలన్నీ నేను బైడెన్లో చూశాను. ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ నామినేషన్‌ను సాధించి, అధ్యక్ష ఎన్నికలల్లో గెలవడమే నా లక్ష్యం. ట్రంప్‌ను ఓడించేలా ఈ దేశాన్ని ఏకం చేసేందుకు కూడా పని చేస్తాను. ఎన్నికలకు ఇంకా 107 రోజులు ఉన్నాయి. మనందరం కలిసి పోరాడదాం. అప్పుడే కచ్చితంగా గెలుస్తాం’ అని కమలా హారిస్ అన్నారు.