ఏపీలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.10 అడుగులకు చేరింది. ఈ క్రమంలో సముద్రంలోకి 13.23లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు గోదావరి వరదతో కోనసీమ పరిధిలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉద్యాన పంటలు, కాజ్‌వేలు మునిగిపోయాయి. పి.గన్నవరం, అయినవిల్లి మండలాలకు చెందిన లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లాలోని ప్రధాన జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. నాతవరం మండలం తాండవ జలాశయం పూర్తిస్థాయికి చేరకుని నిండుకుండను తలపిస్తోంది. నర్సీపట్నం సమీపంలోని రావణాపల్లి జలాశయం నుంచి అదనపు నీటిని కిందికి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో… రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.