తెలంగాణలో ఒక్కొక్కరిపై రూ.1,76,360 అప్పు ఉంది. 2014-15లో రూ.20,251 ఉన్న ఆ సంఖ్య పదేళ్లలో ఐదు రెట్లు పెరిగింది. రాష్ట్ర మొత్తం అప్పు రూ.72,658 కోట్ల నుంచి ఏకంగా 824.5 శాతం పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు 8.7 శాతానికి పైగా పెరిగింది. ప్రణాళిక శాఖ తయారుచేసిన 2024 సామాజిక ఆర్థిక ముఖచిత్రం నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 ఉండగా, 2023-24 నాటికి అది రూ.3,47,299లకు పెరిగింది.
2023-24 లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.9 శాతం వృద్ధితో రూ.14.64 లక్షల కోట్లకు చేరగా.. జిల్లా స్థూల ఉత్పత్తి పరంగా రంగారెడ్డి జిల్లా రూ.2,83,419 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక చివరి స్థానంలో ములుగు జిల్లా అత్యల్పంగా రూ.6,914 కోట్లు ఉంది. రాష్ట్రంలోని నిరుద్యోగం రేటు జాతీయ సగటు కంటే 1.3శాతం ఎక్కువగా ఉంది. రహదారుల పొడవు హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 1,332 కిలోమీటర్లు ఉన్నాయి. ములుగులో అతి తక్కువగా 41 కిలోమీటర్ల మేర ఉన్నాయి.