బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదివారం రోజున ఆందోళనకారులు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఈ ఘటనల్లో సుమారు 100 మంది మరణించారు. ఇందులో 14 మంది పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు వందల మంది గాయపడ్డారు.
ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు.. ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార అవామీలీగ్, దాని విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణలు అడ్డుకునేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. మరోవైపు సిరాజ్గంజ్లోని ఓ పోలీస్ స్టేషన్కు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో 14 మంది పోలీసులు మృతి చెందారు. మొత్తం 300 మంది పోలీసులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.