బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి.. ఓ ఉన్నతాధికారి కలిసి కుట్ర పూరితంగా రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ధరణీ పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టూరిజం ప్లాజాలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చర్చావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. రైతులకు భూమి చిక్కులు కూడా లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం 2024ను తీసుకొస్తామని ప్రకటించారు.
చట్టాలు సరిగ్గా చేయకపోతే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. సామాన్యుడి నుంచి మేధావి వరకు అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవడానికి ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడంతో పాటు ఇలాంటి చర్చవేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేవిధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.