సోమవారం మరోసారి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు అయిన భవానిపురం, స్వాతి థియేటర్, ఊర్మిళా నగర్ లో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద ప్రాంతాలలో నష్టం అంచనా ప్రారంభించామని తెలిపారు. వరదల్లో నష్టపోయిన అందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అయితే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగానే వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
గత ముఖ్యమంత్రి జగన్ పనితీరు వల్ల ఏపీకి అప్పు ఇచ్చేవారు ఎవరు లేరని అన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. దీంతో ఇప్పుడు తనకు కొత్తగా అప్పు పుట్టే అవకాశం లేదని అన్నారు. ఏది ఏమైనా త్వరలోనే బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.