లడ్డూ నాణ్యత పై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు వాస్తవమేనని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం ట్రేడర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమక కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి చేసిన తప్పులకు జగన్ శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. అయితే ఆల్ఫా సంస్త రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యిని సరఫరా చేసిందని వెల్లడించారు. ఆలయంలో ఉండాల్సినటువంటి పరకామణిని బయటికి తీసుకొచ్చింది ఎవ్వరూ అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ నాణ్యతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించారని పేర్కొన్నారు. ప్రధానంగా కమీషన్ల కోసమే లడ్డులో నాణ్యత తగ్గిందని తెలిపారు. నిపుణుల కమిటీ నివేదికలో కల్తీ నెయ్యి అంశాలు వెలుగులోకి వచ్చాయని.. విజిలెన్స్ నివేదిక కూడా అత్యంత త్వరలోనే రానుందని తెలిపారు.