రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టీ మరీ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. రైతులను కించపరిచిన పృథ్వీరాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రైతులు నినాదాలు చేశారు. కాగా, అమరావతి రాజధానిలో రైతుల ఆందోళనలు 23వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతులు నిరసనకు దిగారు. మందడం, తుళ్లూరులో రైతుల నిరసనలకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సంఘీభావం తెలపనున్నారు.