హైదరాబాద్ నగరంలో ఇప్పుడు తుపాకులు పట్టుపడిన ఘటన కలకలం రేకెత్తిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పోలీసులు తుపాకుల ముఠా సూత్రదారులను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 7 తుపాకులు, 11 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆయుధాల్లో రివాల్వర్, పిస్టల్, తపంచాలున్నాయి. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వివరాలను వెల్లడించారు.
కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డి బీకామ్ చదువును మధ్యలోనే వదిలేశాడు. సూరారంలోని ఓ హాస్టల్ లో ఉంటూ భారీ వ్యూహమే పన్నాడు. తొలుత నాగోల్ అమేజాన్ బ్రాంచ్ లో నాలుగు నెలల పాటు పని చేసాడు. రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. జైలులో ఖైదీలతో పరిచయం పెంచుకొని ఈజీ మనీ కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే వెపన్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నాడు. ముంబయి, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నేరాలకు స్కెచ్ వేశాడు. సాయిరాం రెడ్డి గ్యాంగ్ గురించి సమాచారం తెలిసుకున్న ఎస్ఓటీ పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు. తప్పించుకున్న నిందితుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.