తెలంగాణలో గ్రూపు 4 పరీక్ష ఫైనల్ ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గాంధీ భవన్ ముట్టడికి గ్రూపు 4 అభ్యర్థులు ప్రయత్నించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి రెండు నెలలు అయినా ఇప్పటికీ ఉద్యోగాలు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. తాము నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు.
తాజాగా గాంధీభవన్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి 460 రోజులు అవుతుందని.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయ్యిందని అభ్యర్థులు తెలిపారు. డీఎస్సీ పోస్టులకు 56 రోజుల్లో పూర్తిచేసిన టీజీపీఎస్సీ అధికారులు.. ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ పోస్టులకు 460 రోజులు ఎలా సమయం పడుతుంది అని ప్రశ్నించారు. వెంటనే ఇతర ప్రక్రియలు పూర్తిచేసి ఈ దసరా పండుగ వరకు గ్రూప్ 4 తుది ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు.