ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతియేటా వైభవంగా జరిగే ఉత్సవాల్లో ఈసారి ఒక స్పెషల్ ఉంది. 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా సరికొత్త అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహా చండీ దేవి రూపంలో అమ్మవారు కొలువుదీరింది. బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఐదవ రోజుకు చేరాయి.
అందులో భాగంగా సోమవారం మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి దుష్టశిక్షణ, షిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి,మహాకాళీ, మహాసరస్వతి,త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ అవతారం ధరించింది. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లు అని పండితులు చెబుతున్నారు. చండీ అమ్మవారి అనుగ్రహంతో విద్య,కీర్తి సంపదలు లభించడంతో పాటు శత్రువులు తొలగిపోతారని పూజారులు సెలవిచ్చారు.