రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెల్సిందే. తనను హర్షసాయి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 24వ తేదీన నార్సింగి పీఎస్‌లో హర్షసాయి మీద కేసు నమోదైంది. అంతేకాకుండా హర్షసాయి తండ్రి బెదిరింపులకు గురిచేశాడని అతని మీద కూడా బాధితురాలు కేసు పెట్టింది.
నాటి నుంచి హర్షసాయి, అతని ఫ్యామిలీ ఎవరికి కనిపించకుండా ఎస్కేప్ అయ్యారు.దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే హర్షసాయి తెలంగాణ హైకోర్టును మంగళవారం ఆశ్రయించాడు. నార్సింగి పీఎస్‌లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌నుతెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో ఆయన తండ్రి దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయగా.. తాజాగా తనయుడికి హైకోర్టు రిలీఫ్ ఇస్తుందా? లేదా అనేది తెలియాల్సిఉంది.