కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట సొంత నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక డిమాండ్ పెట్టారు. మంగళవారం హైదరాబాద్ లో ఈ నెల 27న నిర్వహించే సదర్ సమ్మేళన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన చేపట్టడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. మూసీలో నీళ్లు లేక పశువులకు మేత దొరకడం లేదని అన్నారు. ఈ కారణంగా హైదరాబాద్లో బర్రెల సంఖ్య భారీగా తగ్గిపోయిందని తెలిపారు. 27న ఉదయం 11 గంటలకు సదర్ సమ్మేళన్ నిర్వహించబోతున్నట్లు ప్రకటన చేశారు.
సదర్ రాష్ట్ర పండుగగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా, యాదవ సామాజికవర్గం అత్యంత వైభవంగా నిర్వహించే పండుగల్లో సదర్ ఉత్సవం ఒకటి. గతంలో ఈ ఉత్సవాన్ని వివిధ యాదవ రాజ వంశీయులు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ పండుగను ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్, మమహారాష్ట్రలలో ‘పోలా’ అని, కర్ణాటక రాష్ట్రంలో ‘కంబాల’ని, తమిళనాడులో ‘జల్లికట్టు’, నేపాల్ లో ‘మాల్వి’ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ‘సదర్’ గా పిలుస్తున్నారు.